క్రీస్తు మనకోసం మరణించాడు.
“కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వాసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.”
యోహాను 3:16-18.
రక్తము లేకుండా ఏ వ్యక్తి జీవించలేదు. రక్తము జీవానికి మూలము (నిత్యజీవం), మానవుడు పాపము వలన జీవము కోల్పోయాడు. పాపి తిరిగి జీవము పొందగోరినట్లయితే రక్తము తనకు దానము చేయబడాలి ఆ రక్తం మరణము లేదా పాపము లేనిదే యుండాలి పాప రహితుడు క్రీస్తు మాత్రమే. అందుకే యేసు రక్త దానము చేసారు. రక్తమును పోలిన వాటిలో బాహ్య అలంకారము మానవుని శుద్ధి చేయదు కాని హృదయమందు చర్య జరిగినప్పుడు మానవుడు నిత్యజీవము పొందుతాడు.
దేవుడు మానవులను ప్రేమించి పాపులైనవారితో సమాధానపడటానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడు.
ఆయన తన మరణం ద్వారా పాపవిమోచనా క్రయధనాన్ని చెల్లించాడు.

క్రీస్తు మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచాడు...
“నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.”
I కొరింథీయులకు 15:3-4.
క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించి, పాతిపెట్టబడటమే కాదు. మూడవదినాన తిరిగి మరణంనుండి బ్రతికింపబడ్డాడు. క్రీస్తు యొక్క పునరుత్థానశక్తి వలన మనము కూడా పాపము మీద సంపూర్ణ శక్తిని పొందియున్నాము. మనము కూడా ఆయనను పోలి పరిశుద్ధ జీవితము జీవించే కృపను పొందాము.
“...ఆయన లేచియున్నాడు...”
మత్తయి 28:6.
“...దేవుడాయనను లేపాడు...”
అపో. 10:40.
“...దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను...”
అపో. 13:30.
తరువాత ఆయన ఈ భూమిమీద 40 రోజులు తన శిష్యులతో సంచరించాడు. ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు.
“...వారు చూచుచుండగా.. ఒక మేఘము ఆయనను కొనిపోయెను...”
అపో. 1:9.
“...ఈ యేసును దేవుడు లేపెను.. దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడెను...”
అపో. 2:32,33.

క్రీస్తే...ఏకైక మార్గం
“యేసు నేనే మార్గమును సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.”
యోహాను 14:6.
“దేవుడు.. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు...”
2 కొరింథీ 5:19.
“మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామమునేనే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.”
అపో. 4:12.
యేసుక్రీస్తు ఆయన రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచుట ద్వారా శిక్షావిధిలో ఉన్న పాపులకు దేవునితో సమాధానపడి క్షమించబడుటకు ఒక మార్గాన్ని ఏర్పరచాడు.
యుగాల తరబడి మానవుడు ఈక్షణంవరకు ఇంకా పాపపు అవస్థలుండి విముక్తి పొందుటకు ఇతర దేవుళ్ళను పూజిస్తూ ఆశ్రయిస్తూనే ఉన్నాడు.
అయితే దేవునియొక్క పునాది స్థిరముగా ఉన్నది.
“...యేసుప్రభువు చెప్పాడు నేనే మార్గమును, సత్యము, జీవమునై యున్నాను. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.”
“రక్షణ మరి ఏ నామమున లభించదు.. ఈ నామమునేనే మనము రక్షణపొందాలి.”

మరణమునుండి జీవమునకు మార్గము
“నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
యోహాను 5:24.
యేసు తన మాటలువిని ఆయనయందు విశ్వాసముంచేవానికి ఈ వాగ్దానం చేస్తున్నాడు. అతడు ఈ క్రింది వాటిని స్వతంత్రించుకుంటాడు.
1. నిత్యజీవము
ఈ జీవము కొనసాగుతూనే ఉంటుంది, దానికి అంతం లేదు, నిత్యత్వంలోగుండా కొనసాగుతుంది. భౌతికంగా మనం మరణించినప్పటికీ ఈ వాగ్దానం ప్రకారం, మనం జీవిస్తూనే ఉంటాము. ఇది ఎటువంటి జీవం? నిత్యజీవం.
2. తీర్పు లేదు.
రోమా 5:18లో దేవుడంటున్నాడు అందువల్ల ఒకడు(ఆదాము) చేసిన పాపంవల్ల ప్రజలందరికి శిక్షవిధించబడింది.
అదేవిధంగా ఒక(యేసుక్రీస్తు) నీతికార్యాన్ని చేయడంవల్ల అందరూ శిక్షను తప్పించుకొని అనంతజీవితం పొందుటకు మార్గం ఏర్పడింది.
యేసుక్రీస్తునందు విశ్వాసముంచటం ద్వారా పుట్టుకతో మనమీద ఉన్న శిక్షావిధి కొట్టివేయబడుతుంది.
3. “....మరణమునుండి జీవానికి దాటియున్నాడు.”
గుర్తుంచుకోండి, మానవుడు ఆధ్యాత్మిక మరణంతో పుట్టాడు. అయితే ఈ వాగ్దానాన్నిబట్టి యేసునందు విశ్వాసముంచటం ద్వారా అతని ఆత్మ నిత్యజీవం పొందుతుంది.
“అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమైయుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేతనే మీరు రక్షింపబడియున్నారు.”
ఎఫెసీ 2:5.
“అపరాధముల వలననూ, శరీరమందు సున్నతిపొందక యుండుటవలననూ, మీరు మృతులై యుండగా..... మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను.”
కొలొస్సి 2:13.
ముగింపు