దేవుని వాక్యమును చదువుట
“మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను; అది అతని యొద్ద ఉండవలెను. తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు, అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.”
ద్వితీయోపదేశకాండము 17:18,20
రాజునుగూర్చి దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించినప్పుడు, రాజు సింహాసనమెక్కిన వెంటనే దేవుని వాక్యము యొక్క తన సొంత ప్రతిని తయారుచేసికొని, దానిని తనయొద్ద ఉంచుకొని, జీవితాంతము ప్రతిదినము దానిని చదువుట అలవాటుగా చేసికొనవలెనని దేవుడు స్పష్టము చేసెను. ఇట్లు చేయుటవలన రాజు తన దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొనును. కావున, నేడు మనమును దేవునికి భయపడుట నేర్చుకొనవలెనని కోరుకొనినయెడల, మనమును దేవుని వాక్యమును ప్రతిదినము చదువుట అలవాటుగా చేసికొనవలెను!
దేవుని వాక్యమును ప్రతిదినము చదువుము!
ద్వితీయోపదేశకాండము 8:3లో దేవుడు ఇట్లు సెలవిచ్చెను:
“...ఆహారమువలననే గాక
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన
నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు...”
ద్వితీయోపదేశకాండము 8:3
మన ఆత్మకు ఏ మాత్రమును విలువలేని మాటలు దేవుడు పలికెనా? ఈ వచనములో ప్రతి మాటయు మనుష్యుడు జీవించుటకొరకే అని దేవుడు చెప్పుచున్నాడు.
ప్రతి మాటను చదువుము!
“దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే...”
సామెతలు 30:5
“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము
ఉపదేశించుటకును, ఖండించుటకును,
తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు.”
2 తిమోతి 3:16-17
పరిశుద్ధలేఖనములు రెండు: #1 దేవుని ఆవేశమువలన కలిగినవి, #2 ప్రయోజనకరమైనవి అని ఈ వచనములో దేవుడు చెప్పుచున్నాడు. పరిశుద్ధలేఖనములలో ఎంతభాగము దేవుని ఆవేశమువలన కలిగినది? అంతయు! పరిశుద్ధలేఖనములలో ఎంతభాగము మనకు ప్రయోజనకరమైనది? అంతయు! అయిన మనము పరిశుద్ధలేఖనములలో ఎంతభాగము చదువవలెను? అంతయు!
పరిశుద్ధలేఖనములన్నిటిని చదువుము!
ఇది వ్రాయబడియున్నది గనుక:
- పరిశుద్ధలేఖనమంతయు దేవుని ఆవేశమువలన కలిగినది,
- ప్రతి మాటయు మన ఆత్మకు సాధ్యమైన ఆహారము,
- జీవితాంతము దానినంతటిని చదువవలెనని మనకాజ్ఞాపింపబడినది
కావున, జీవితాంతము పరిశుద్ధలేఖనములన్నిటిని చదువుటకు ప్రయత్నింతము!
పైన చెప్పబడిన విషయములను దృష్టిలో పెట్టుకొని, వాటిని సత్యమని నమ్ముచు, పాఠకునికి సహాయకరముగా ఉండునని ఆశించుచు ఈ క్రింది సూచనలను అందించుచున్నాము:
- ద్వితీయోపదేశకాండము 17:20, ద్వితీయోపదేశకాండము 8:3, 2తిమోతి 3:16-17 కంఠస్థము చేయుము
- తగిన చదువు ప్రణాళికను కనుగొనుము (సామెతలు 4:26), లేక రీడర్స్ బైబిల్‌పై ఒకదానిని తయారుచేసికొనుము
- చదువుటకు ఒక స్థిరమైన, క్రమమైన సమయమును ఏర్పరచుకొనుము
- ఎక్కువగా చదువుటకు లేక వెనుకబడినది పూరించుకొనుటకు ప్రతివారము ఒక క్రమమైన సమయమును కనుగొనుటకు ప్రయత్నించుము (సామెతలు 22:3)
దీనిగూర్చి మరింత తెలిసికొనుటకు Why Read Your Bible? మరియు Should We Read the Genealogies? అను వీడియో బోధనలను చూడుము.
← వాక్య స్వీకరణకు తిరిగి వెళ్ళుము