పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ నీకు బోధించి నడిపించును
మీరు ఆయనవలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక
ఎవడును మీకు బోధింపనక్కరలేదు;
ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు.
1 యోహాను 2:27
విశ్వాసులు తమ అతిపరిశుద్ధమైన విశ్వాసములో ఎదుగుటకు కావలసినదంతయు తమయొద్ద కలదనియు, సెమినరీకి వెళ్ళవలసిన అవసరము లేదనియు, డాక్టరేటు కలిగిన వ్యక్తిచేత బోధింపబడవలసిన అవసరము లేదనియు విశ్వాసులను ప్రోత్సహించుటయే ఈ వెబ్‌సైట్ యొక్క సంపూర్ణ ఉద్దేశము. దేవుడు పురుషులను స్త్రీలను బోధకులుగా ఉపయోగించడనియు వారికి ఆ వరమునియ్యడనియు కాదు, కాని నేర్చుకొనుటకు మన ప్రధాన ఆధారము దేవుని ఆత్మచేత బోధింపబడు దేవుని వాక్యమే గాని, దేవుని సంగతులను నేర్చుకొనుటకు మనుష్యులపై ఆధారపడుట కాదు. కావున దేవుడు మనకు బోధించుటకు దేవుని ఆత్మను, మన పాఠ్యపుస్తకముగా దేవుని వాక్యమును అనుగ్రహించియున్నాడు.
కాని దేవుడు వాటిని తన ఆత్మవలన మనకు బయలుపరచియున్నాడు: ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.
1 కొరింథీయులకు 2:10-12
ఈ భాగములో, దేవుని సంగతులను ఆత్మ ద్వారానే మనము నేర్చుకొనగలమని చూతుము. ఇంకను, పౌలు 2 కొరింథీయులకు వ్రాసిన పత్రికలో ఇట్లు వ్రాయుచున్నాడు:
మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
2 కొరింథీయులకు 3:5-6
కావున, లేఖనములను ఒక విద్యాసంబంధమైన వ్యాయామముగా అధ్యయనము చేయుట మన లక్ష్యము కాదు, కాని దేవుని సంగతులను ఆత్మచేత బోధింపబడుటకే మనము వెదకవలెను. మనము జ్ఞానమును కూడబెట్టుకొనుటకు కోరుకొనము, కాని ఆయన పోలికగా మార్చబడుటకు సహాయపడు సంగతులను కనుగొనుటకే వెదకుదుము.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమస్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు... మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో మీరు తెలిసికొనవలెనని...
ఎఫెసీయులకు 1:17,19
యోహాను 14 నుండి 16వ అధ్యాయములు పరిశుద్ధాత్మనుగూర్చిన ఉపదేశములను తెలియజేయుచున్నవి. ఈ అధ్యాయములలో రెండు ప్రత్యేకమైన వచనములు పరిశుద్ధాత్మను బోధకునిగాను నడిపించువానిగాను వివరించుచున్నవి:
ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ
సమస్తమును మీకు బోధించి,
నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
యోహాను 14:26
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు
మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును;
ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి
సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
యోహాను 16:13
కావున, మనము నేర్చుకొనవలెననియు ఎదుగవలెననియు కోరుకొనునప్పుడు, బైబిలుపై ఇతర మనుష్యుల వివరణలలో మన నమ్మకమును ఉంచకుండ, మొదట దేవుని పాఠ్యపుస్తకమును చూచి, ఆయనతో మాట్లాడుటకును, మన బోధకునిగా ఆయనతో సహవాసము చేయుటకును సమయము వెచ్చింతము. లేఖనముల ద్వారా మన ప్రశ్నలన్నిటికిని జవాబిచ్చుటకు ఆయన సమర్థుడు. ఆయన ఇట్లు చెప్పుచున్నాడు:
అడుగుడి మీకియ్యబడును;
వెదకుడి మీకు దొరకును;
తట్టుడి మీకు తీయబడును.
ఏలయనగా అడుగు ప్రతివాడును పొందును.
మత్తయి 7:7-8
పరిశుద్ధాత్మ చేయునది
మనలను ఓదార్చును
మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును.
యోహాను 14:18
మనకు శక్తినిచ్చును
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక
మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను
భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.
అపొస్తలుల కార్యములు 1:8
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును
దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ
శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,
కొలొస్సయులకు 1:11
లోకమును ఒప్పించును
ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు
తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
యోహాను 16:8
ఎల్లప్పుడు మనతో కూడ ఉండును
నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
హెబ్రీయులకు 13:5
నేను తండ్రిని వేడుకొందును,
మీయొద్ద ఎల్లప్పుడునుండుటకై
ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
యోహాను 14:16
“వద్దు” అనుటకు మనకు సహాయము చేయును
సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి,
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము వివేకముతోను నీతితోను భక్తితోను
ఈ యుగమందు జీవించుకొనవలెనని మనకు బోధించుచున్నది.
తీతుకు 2:11-12
ఆత్మసంబంధమైన జీవమునిచ్చును
క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని
మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల,
మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు
చావునకులోనైన మీ శరీరములను కూడ జీవింపజేయును
మీలో నివసించు ఆయన ఆత్మద్వారా.
రోమీయులకు 8:10-11
విశ్వాసులను ముద్రించును
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి,
వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు
విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ఎఫెసీయులకు 1:13-14
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి;
విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
ఎఫెసీయులకు 4:30
నీయందు పరిశుద్ధాత్మ ఉన్నాడా?
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే
గాని శరీర స్వభావము గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడు ఆయనవాడు కాడు.
రోమీయులకు 8:9
నీయందు పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేనియెడల నీవు దేవుని బిడ్డవు కావు. ఆత్మ నీయందు ఉన్నయెడల, నీ వెట్లు తెలిసికొందువు? అది ఒక భావననా? లేక దేవుని వాక్యమువలననా నీవు తెలిసికొనునది? దేవుని వాక్యము ఏమి చెప్పుచున్నదో చూతము:
యేసుక్రీస్తునందలి విశ్వాసమువలననే మీరందరు దేవుని కుమారులై యున్నారు…
మరియు మీరు కుమారులై యున్నందున
నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను
దేవుడు మన హృదయములలోనికి పంపెను.
గలతీయులకు 3:26; 4:6
ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి
ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు
వాని కడుపులోనుండి జీవ జలనదులు పారును
అని బిగ్గరగా చెప్పెను.
తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను.
యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
యోహాను 7:37-39
మనలోనున్న నిరీక్షణనుగూర్చి మనలను అడుగు ప్రతివానికిని ఉత్తరమియ్యవలెనని మనము ఎల్లప్పుడు సిద్ధముగా ఉండవలెను (1 పేతురు 3:15). నీయందు పరిశుద్ధాత్మ ఉన్నాడని చెప్పుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?
ఇంటిపని
- చదువుము: యోహాను 14-16
- కంఠస్థము చేయుము: 1యోహాను 2:27, యోహాను 14:26, 1కొరింథీయులకు 2:12, గలతీయులకు 3:26, గలతీయులకు 4:6, యోహాను 7:38
దీనిగూర్చి మరింత తెలిసికొనుటకు The Holy Spirit Our Teacher అను వీడియో బోధనను చూడుము.