ఎడబాయ వచ్చును

అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన యెడల ఎడబాయవచ్చును;
అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు.
సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.
1 కొరింథీయులకు 7:15

ఈ వ్యాసమునకు “సహాయము! నా భర్త (లేక నా భార్య) విడిచిపోవుచున్నారు” అను పేరు పెట్టవలెననుకొంటిని, అయితే “ఎడబాయ వచ్చును” అనునది నేను పంచుకొనగోరు లేఖనసూత్రములపైననే ఎక్కువ దృష్టి నిలుపునని తలంచితిని.

నా జీవితభాగస్వామి విడాకులు కోరినప్పుడు, నేను చేయవలసినదానినిగూర్చి కొన్ని స్పష్టమైన లేఖనసూత్రములు నాకు కలిగియుండిన బాగుండెడిదని కోరుకొందును. అయితే, నా క్రైస్తవ నడకలో ఆ సమయమున, సహాయము నిమిత్తము దేవుని మొఱ్ఱపెట్టుటయే నాకు తెలిసిన ఏకైక మార్గము. అయినను, విడాకులనుగూర్చిన పుస్తకములను చదువుటకు నేను చాల సమయము వెచ్చించితిని. ప్రతి పుస్తకము వేరువేరు సలహానిచ్చుచున్నట్లు కనబడెను, మరియు చాలవరకు అవి పెద్దగా సహాయకరముగా కనబడలేదు. విడాకుల ప్రక్రియ అంతటిలో నేను నేర్చుకొనిన కొన్ని సాధారణ లేఖనసలహాలను ఈ వ్యాసములో పంచుకొనవలెనని ఆశించుచున్నాను. సారాంశముగా, నేను మరల విడాకులగుండ వెళ్లవలసివచ్చినయెడల, నేను చేయు సంగతులు ఇవియే. ఈ వెబ్‌సైట్ పైనున్న ఇతర వ్యాసములవలెనే, “నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములయందును ప్రభువు నీకు వివేకమనుగ్రహించును” అని మాత్రమే ప్రార్థనాపూర్వకముగా అడుగుచున్నాను (2 తిమోతికి 2:7).

సూత్రము #1 : “అవిశ్వాసియైనవాడు ఎడబాసిన యెడల ఎడబాయవచ్చును…”

నీ జీవితభాగస్వామి నీ వివాహమును విడిచిపోవలెననుకొనినయెడల, అపొస్తలుడైన పౌలు “ఎడబాయవచ్చును” అని చెప్పుచున్నాడు. అనగా, మనము దానిని ఎదిరింపరాదు; మనము “సమాధానము కలుగజేయు సంగతులను” వెంబడించవలెను (రోమీయులకు 14:19, హెబ్రీయులకు 12:14). కావున, నా విషయములో, “నీవు వెళ్లవలెననుకొన్నయెడల, దయచేసి వెళ్లుము” అని చెప్పగలిగిన స్థితికి నేను రావలసివచ్చెను. ఒక్క వ్యక్తి ఎన్నడును ఒక సంబంధమును కాపాడలేడు, మరియు అట్లు చేయుటకు ప్రయత్నించుట వ్యర్థము. యేసు మనలను ఆయనయందు నమ్మకముంచుమని బలవంతము చేయనట్లే, ప్రేమయు స్వేచ్ఛాపూర్వకమైనదే. నేను ఆయనకు వ్యతిరేకముగా నడుచుచున్నప్పుడు కూడ ఆయన నన్ను ఆశీర్వదించుచునే యుండెను. ప్రేమ “అన్నిటిని సహించును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును” అని దయచేసి జ్ఞాపకముంచుకొనుము (1 కొరింథీయులకు 13:7). నీ జీవితభాగస్వామిని నిరాక్షేపముగా ప్రభువుకు అప్పగింపవలెను; ఆయనను/ఆమెను బలిపీఠముపై ఉంచవలెను. లేఖనము ఇట్లు చెప్పుచున్నది : “మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి, ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక” (1 పేతురు 5:7).

సూత్రము #2 : “నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము”

ఇది నాకు మిక్కిలి కష్టతరమైన సూత్రము. నా జీవితభాగస్వామి వెళ్లిపోవుచున్నప్పుడు, మా ఆస్తులలో కనీసము సగమైనను నాకు దక్కవలెనని తలంచితిని… అనగా నేను ఇప్పటికే అధ్వాన్నమైన భాగమును పొందుచున్నాను, కొంత ఓదార్పైనను ఉండవలెను కదా? అయితే, లేఖనము ఏమి చెప్పుచున్నది?

నేను మీతో చెప్పునదేమనగా
దుష్టుని ఎదిరింపక,
నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు
ఎడమచెంపకూడ త్రిప్పుము.
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల
వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.
మత్తయి 5:39-40

కావున, ప్రతిదానిని సమానముగా పంచుకొనుటకై నా జీవితభాగస్వామితో పోరాడిన తరువాత, దానికి బదులుగా అంతటిని ఆమెకే ఇచ్చివేయవలెనని నిశ్చయించుకొంటిని. మన లక్ష్యము ఎల్లప్పుడును “కీడును మేలుచేత జయించుటయే” (రోమీయులకు 12:21) కావలెను, “ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు” (రోమీయులకు 12:20). ఆహా, కేవలము విడిచిపెట్టుటలో ఎంత మేలు కలిగెను! నీకును యేసుకును మధ్య క్రొత్త జీవితమునకు ఇదే సమయము. ఆ ఆస్తులలో ఏదియు నిన్ను సంతోషపెట్టదు, అవి కేవలము చెడు జ్ఞాపకములనే తెచ్చును.

సూత్రము #3 : “సహోదరులమీద వ్యాజ్యెము వేయకుడి”

మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు
వాడు పరిశుద్ధులయెదుట గాక
అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?
1 కొరింథీయులకు 6:1

ఈ విషయమున అనేకులు నాతో అంగీకరింపకపోవచ్చునని నాకు తెలియును, అయితే ఇది నా ఆజ్ఞకాదు, ప్రభువుదే (1 కొరింథీయులకు 14:37). నీ జీవితభాగస్వామి విశ్వాసియైనయెడల, ఈ విషయములను సంఘము వెలుపలనున్న న్యాయవాదులుకాక సంఘపు పెద్దలు చూడవలెను. నీ జీవితభాగస్వామికి కావలసినది ఇచ్చి, వెళ్లనిచ్చుటవలన నీవు అనేక ఇబ్బందులనుండి తప్పించుకొందువు. నా విషయములో, ఒక పెద్ద నాకు ఈ విషయమునుగూర్చి సలహానిచ్చునాటికే నేను ఒక న్యాయవాదితో ప్రారంభించియుంటిని. ఆ సమయమున నేను విడాకులకు అంగీకరింపనని నా న్యాయవాదికి చెప్పితిని, మరియు నా భార్యతో మాటలాడుటకు ఒక పెద్దను ఏర్పాటుచేసితిని. లేఖనము “ఎడబాయవచ్చును” అని చెప్పినను, “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు” (మత్తయి 19:6) అని కూడ చెప్పుచున్నది. ఆచరణలో, సమాధానము కాపాడుకొనుటకు వారిని వెళ్లనిచ్చుటయే దీని అర్థము, అయితే విడాకులకు మనమంతట మనము అంగీకరింపవలెనని నేను నమ్మలేను. వారికి విడాకులు కావలెనన్నయెడల, రాజ్యాంగరీత్యా వారు వాటిని పొందవచ్చును, అయితే నా ఆశీర్వాదముతో కాదు. విడాకుల ప్రక్రియలో నేను విడాకులకు వ్యతిరేకమనియు, దానికి అంగీకరింపననియు ప్రత్యేకముగా వ్రాయించితిని. దీనివలన నా జీవితభాగస్వామి తప్పు లేని విడాకులను కోరగలిగెను, అది నాకు ఏ న్యాయపరమైన మార్గమును మిగల్చలేదు. అయితే, “మేము చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము” (2 కొరింథీయులకు 5:7). అనగా, మన పరిస్థితులనుబట్టి మనకు ఉత్తమమని తోచుదానిపై కాక, దేవుని వాక్యముద్వారా ఆయన మనలను ఏమి చేయుమనుచున్నాడో దానిపైననే మన నిర్ణయములు ఆధారపడవలెను.

సూత్రము #4 : “అన్ని విషయములయందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి”

అన్ని విషయములయందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
1 థెస్సలొనీకయులకు 5:18
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును
స్తుతియాగము చేయుదము, అనగా
ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
హెబ్రీయులకు 13:15

అయితే నీవు అడుగుచున్నావు : “ఈ భయంకరమైన పరిస్థితిలో నేను ఎట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలను?”. ఈ పరిస్థితి ప్రభువునుండే వచ్చినదని మాత్రమే నేను చెప్పగలను. మనము ఆయననిమిత్తము శ్రమపడవలెననునది ఆయన కోరిక :

ఏలయనగా క్రీస్తువిషయమై మీరాయనయందు నమ్మవలెననునది మాత్రమేగాక,
ఆయననిమిత్తము శ్రమపడవలెననునది కూడ
మీకు అనుగ్రహింపబడియున్నది.
ఫిలిప్పీయులకు 1:29

ఇది యోబు గ్రంథపు సందేశము కాదా? నీతిమంతులు శ్రమపడుదురు, అయితే ఎందుకు? మనము ఆయన మహిమనిమిత్తము సృజింపబడలేదా (యెషయా 43:7)? మన విశ్వాసము పరీక్షింపబడునట్లు ఆయన తన బిడ్డలను శ్రమపడనిచ్చుచున్నాడు :

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని
అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత,
ప్రస్తుతమున కొంచెము కాలము

నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా?
దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచి,
యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు స్తుతిగాను మహిమగాను ఘనతగాను కనబడునట్లు చేయుచున్నది.
1 పేతురు 1:6-7
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము;
క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల,
క్రీస్తుతోడి వారసులము.
మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.
రోమీయులకు 8:16-18

ప్రియ పాఠకుడా, నీకు ఏమి అవసరమో ప్రభువునకు తెలియదా? లేఖనము “అవసరమునుబట్టి మీరు శ్రమపడుచున్నారు” అని చెప్పుచున్నది. ఇప్పుడు నీవు శ్రమపడుచున్నయెడల, నీ విశ్వాసమును పరీక్షించుటకు అవసరమైనదానినిబట్టియే అది జరుగుచున్నది. మన జీవితములోని పాపసంబంధమైన శరీరసంబంధమైన సంగతులను వేరుపరచుటకు ఆయన మనయందు శస్త్రచికిత్స చేయుచున్నందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలమా? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను; అదియే ఆయన మనలను చేయుమని కోరినది. మనము ఆయన మహిమనిమిత్తము సృజింపబడితిమి.

ఏమి? మనము దేవునివలన మేలు అనుభవించుదుమా,
కీడును మనము అనుభవింపతగదా?
యోబు 2:10

నీవు విడాకులగుండ వెళ్లుచున్నయెడల, కీడు మధ్యన మేలును నీవు చూడగలవని ఆశించి ప్రార్థించుచున్నాను. నేను చెప్పుటకు నేర్చుకొన్నట్లుగా, నా విడాకులు నాకు జరిగిన అత్యుత్తమ సంగతియని నీవును చెప్పగలవని ఆశించుచున్నాను. అది నన్ను క్రీస్తునొద్దకు నడిపించిన మార్గము.