మీరు విశ్వాసములో ఉన్నారేమో మిమ్మును మీరే శోధించుకొనుడి…
క్రమముగా సంఘమునకు వెళ్లు ఒక వ్యక్తికి ఈ క్రింది పత్రిక వ్రాయబడెను. సంఘమునకు వెళ్లుట, సరియైన మాటలన్నియు పలుకుట, సరియైన సంప్రదాయములన్నియు అనుసరించుట, తాను క్రైస్తవురాలననని హృదయపూర్వకముగా నమ్ముట, అయితే జీవితాంతమున తాను నిజముగా రక్షింపబడలేదని తెలిసికొనుట—సాతాను వేయు గొప్ప మోసములలో ఒకదానిలో ఆమె పడిపోయెనేమో అను చింత దీనికి కారణము.
సంఘములో నీ ప్రక్కన కూర్చుండు వ్యక్తియే ఆమెయై యుండవచ్చును. దయచేసి, ఈ సత్యమును పంచుకొనుటద్వారా ఆమెకు సహాయము చేయుము, ఏలయనగా క్రీస్తు రాజీ వాక్యమును మనకు అప్పగించియున్నాడు.
ఇదంతయు దేవునివలననైనది; ఆయన క్రీస్తుద్వారా
మనలను తనతో సమాధానపరచుకొని,
మాకు సమాధానపరచు పరిచర్యను అనుగ్రహించెను;
ఏలయనగా దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక,
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు,
ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
2 కొరింథీయులకు 5:18-19
ప్రియ స్నేహితుడా,
గత వారము మనము కలిసి మాటలాడుకొనిన సమయము నాకు మిక్కిలి సంతోషమును కలుగజేసెను. మనము మాటలాడుకొనిన సంగతులను నీవు ఆలోచించియుందువనియు, ఆలోచించుచునే యుందువనియు ప్రార్థించుచున్నాను.
నీవు “నేను నమ్ముచున్నాను” అను మాటను వాడు విధానము నన్ను మిక్కిలి కలవరపెట్టుచున్నది. నమ్ముట అను ఈ మాటను, దేవుని యెదుట తాము నిజముగా ఎక్కడ ఉన్నారో గ్రహించుటలో మనుష్యులను మోసపుచ్చుటకు సాతాను ఉపయోగించవచ్చును. దయచేసి ఈ క్రింది వచనములను ప్రార్థనాపూర్వకముగా ఆలోచించి, హృదయపూర్వకముగా దేవునినిట్లు అడుగుము : “ప్రభువా, నీ యెదుట నేనెక్కడ ఉన్నాను?”
“నమ్ముట”నుగూర్చి దేవుని వాక్యము ఏమి చెప్పుచున్నదో దయచేసి ఆలోచించుము :
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టినవానియందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక
నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
యోహాను 3:16
దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు.
ఆలాగు నమ్ముట మంచిదే;
దయ్యములును నమ్ముచున్నవి, నమ్మి వణకుచున్నవి.
యాకోబు 2:19
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా,
మేము నీ నామమున ప్రవచింపలేదా,
నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా,
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను,
అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని
బహిరంగముగా వారితో చెప్పుదును.
మత్తయి 7:22-23
ఈ మనుష్యుడు నిస్సందేహముగా దేవుని నమ్మెను, అయినను ఇప్పుడు దేవునికి దూరముగా నిత్యత్వమును గడుపుచున్నాడు. “నమ్ముట”, “క్రైస్తవుడగుట” అను వాటి నిజమైన అర్థమునుగూర్చి సాతాను అనేకమందిని మోసపుచ్చి కలవరపెట్టియున్నాడు.
ప్రభువా, ప్రభువా, అని నాతో చెప్పు ప్రతివాడును
పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని,
మత్తయి 7:21
“నేను క్రైస్తవుడను” అని చెప్పు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు. “నేను దేవుని నమ్ముచున్నాను” అని చెప్పు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు.
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో
మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి;
మిమ్మును మీరే పరీక్షించుకొనుడి;
యేసుక్రీస్తు మీలో నున్నాడని
మిమ్మునుగూర్చి మీరు ఎరుగరా,
మీరు భ్రష్టులు కానియెడల?
2 కొరింథీయులకు 13:5
నిజమైన విశ్వాసమునకు దేవుడు తన వాక్యముద్వారా ఆధారములను మనకిచ్చియున్నాడు. దేవుని వాక్యమును పూర్తిగా ఉపయోగించుచు, మనము నిజమైన విశ్వాసులమో లేక మోసపోవుచున్నామో తెలిసికొనుటకు మన విశ్వాసమును పరీక్షించుకొనవచ్చును.
(యేసుక్రీస్తునందలి నిజమైన రక్షణకు కొన్ని ఆధారములను ఈ క్రింది వచనములు తెలియజేయుచున్నవి.)
1. ప్రతి నిజమైన విశ్వాసి జీవితములో ఒక క్రొత్త ఆరంభకాలము ఉండును, నీ జీవితము మార్చబడిన ఒక క్షణము. బైబిలు దీనిని క్రొత్తగా జన్మించుట అని పిలుచును.
ఎవడైనను క్రీస్తునందున్నయెడల
వాడు నూతన సృష్టి;
పాతవి గతించెను,
ఇదిగో క్రొత్తవాయెను.
2 కొరింథీయులకు 5:17
అందుకు యేసుఒకడు
క్రొత్తగా జన్మించితేనే కాని
అతడు దేవుని రాజ్యమును చూడలేడని
నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
యోహాను 3:3
నీ జీవితములో నీవు మార్చబడిన సమయమొకటి ఉండెనా?
2. మనము క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు పాపరహితులముగా ఉందుమని బైబిలు మనకు బోధింపదు. అయితే, ఆయన ఆజ్ఞలను గైకొనవలెననెడి కోరిక మనకు కలుగును. ఆయన చిత్తము చేయుటద్వారా ఆయనను సంతోషపెట్టవలెననెడి కోరిక మనకు కలుగును.
మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల,
దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము.
ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు,
ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు;
వానిలో సత్యములేదు;
ఆయన వాక్యము ఎవడు గైకొనునో
వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
దీనివలననే మనమాయనయందున్నామని తెలిసికొందుము.
1 యోహాను 2:3-5
ఆయనకు లోబడవలెననెడి కోరిక నీకు కలదా?
3. దేవుని నిజమైన బిడ్డలందరును దేవుని శిక్షను పొందుదురు.
ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.
శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు;
దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు.
తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు,
మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
హెబ్రీయులకు 12:6-8
నీ జీవితములో ఒక నిర్దిష్ట పాపమునకు
దేవుడు నిన్ను శిక్షించిన సమయమొకటి నీకు జ్ఞాపకమున్నదా?
4. ఈ జీవితమున తనకు సహాయము చేయుటకు ప్రతి నిజమైన విశ్వాసికి పరిశుద్ధాత్మ ఇయ్యబడును. అయితే, అతనికి ఈ లోకసంబంధమైన శరీరము కూడ కలదు. కావున ప్రతి విశ్వాసియందు ఈ రెంటి మధ్య పోరాటము జరుగును. లోకమువలె జీవించుటకును, ఆత్మ కోరు ప్రకారము జీవించుటకును మధ్య, అనగా దేవుని చిత్తమునకు లోబడుచు దేవుని వాక్యానుసారము జీవించుటకును మధ్య, మనము శోధింపబడుదుము.
నేను చెప్పునదేమనగా
ఆత్మానుసారముగా నడుచుకొనుడి,
అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును;
ఇవి ఒకదానికొకటి విరోధములై యున్నవి గనుక
మీరు కోరునవి చేయకుండ ఇవి మిమ్మును అడ్డగించును.
గలతీయులకు 5:16-17
ఈ పోరాటము నీయందు కలదా?
5. ఏ నిజమైన విశ్వాసియు పాపమును ఆచరింపడు. దీనిని పాపము చేయుటతో కలగాపులగము చేసికొనరాదు. దేవుని చిత్తమునకు విరుద్ధమైన క్రియయే పాపము. విశ్వాసులముగా మనము గ్రహింపకయే అనేకమారులు పాపము చేయుదుము. అయితే పాపమును ఆచరించుట వేరు. దేవుని చిత్తమును తెలిసియు, మార్చుకొనవలెననెడి ఉద్దేశముగాని క్రియగాని లేకుండ దానిని చురుకుగా ఎదిరించుటయే ఇది.
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో
ఆయన బీజము నిలుచును గనుక
వాడు పాపముచేయడు;
వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక
పాపము చేయజాలడు.
1 యోహాను 3:9
మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల,
మనలను మనమే మోసపుచ్చుకొందుము;
మరియు మనలో సత్యముండదు.
1 యోహాను 1:8
నీవు పాపమును ఆచరించుచున్నావా?
కావున, సారాంశమిదే : మనము మనతోనే యథార్థముగా ఉండవలెను. మన స్వంత హృదయమునందు నిజముగా చూచి, ఇట్లు అడుగుకొనవలెను :
- నేను నూతన సృష్టిగా మారిన సమయమొకటి నా జీవితములో ఉండెనా?
- దేవునికి లోబడి ఆయన చిత్తము చేయవలెననెడి కోరిక నాకు కలదా?
- ఒక నిర్దిష్ట పాపమునకు దేవుడు నన్ను శిక్షించిన సమయమొకటి నాకు జ్ఞాపకమున్నదా?
- దేవుని వాక్యమునకు లోబడుటకు నా శరీరముతో నేను పోరాడుచున్నానా?
- నేను పాపమును ఆచరించుచున్నానా?
త్వరలో నిన్ను మరల చూచెదనని ఆశించుచున్నాను.
నీ స్నేహితుడు,
క్రైస్తవుడు
సంబంధిత వ్యాసములు
← విషయాధార అధ్యయనములకు తిరిగి వెళ్లుము