“చక్రము” ద్వారా మన నడతను పరిశీలించుట


చక్రము : మధ్యలో క్రీస్తు; ఆకులు వాక్యము, ప్రార్థన, సహవాసము, సాక్ష్యము; చుట్టూ లోబడు క్రైస్తవుడు క్రియలో

నావిగేటర్స్ సంస్థ స్థాపకుడైన దివంగత డాసన్ ట్రాట్‌మన్ ఇచ్చిన ఈ “చక్రము” దృష్టాంతము, నావిగేటర్స్ సంస్థవారు, ప్రభువుతో మన నడతను పరిశీలించుటకు మిక్కిలి ప్రభావవంతమైన సాధనము. క్రైస్తవ జీవితము ఒక చక్రమును పోలియున్నదని డాసన్ గ్రహించెను, దాని మధ్యలో క్రీస్తు ఉండగా, రహదారి జీవితమే. క్రీస్తు మన జీవితమునకు మధ్యస్థమైయుండి క్రైస్తవ జీవితమును జీవించుటకు మనకు శక్తినిచ్చును. మధ్యలో యేసు లేకుండ, మనము క్రైస్తవ జీవితమును జీవింపలేము. ఆకులు క్రైస్తవులముగా మనము చేయవలసినవాటిని సూచించును : వాక్యము, ప్రార్థన, సహవాసము, సాక్ష్యము. లోబడుటయే టైరు, “రబ్బరు రహదారిని తాకు స్థలము (జీవితము)” అదియే. యేసు మనలను అడిగినదంతయు మనము చేయుచున్నప్పుడు, మన చక్రము సాఫీగా తిరుగును. అయితే, మన ఆకులలో ఒకటి తక్కువైనప్పుడు, చక్రము సమతుల్యత కోల్పోవును. కాలానుకాలము మనము క్రైస్తవులముగా మన నడతను పరిశీలించుకొనవలెను. మనము ఎట్లు నడుచుచున్నామో పరిశీలించుటకు చక్రము ప్రభావవంతమైన సాధనము.

(దృష్టాంతపు ఆంగ్ల శీర్షికలు : Christ = క్రీస్తు; The Word = వాక్యము; Prayer = ప్రార్థన; Fellowship = సహవాసము; Witnessing = సాక్ష్యము; “The Obedient Christian in Action” = “లోబడు క్రైస్తవుడు క్రియలో”.)


మధ్యలో క్రీస్తు. మన జీవితమునకు మధ్యలో యేసుక్రీస్తు ఉండవలెను. అచ్చు లేకుండ చక్రము కదలలేదు. ఆలాగే, యేసుక్రీస్తు లేకుండ, మనము క్రైస్తవ జీవితమును జీవింపలేము :
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు.
ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు
బహుగా ఫలించును;
ఏలయనగా నా వేరుగా మీరేమియు చేయలేరు.
యోహాను 15:5
క్రీస్తు వేరుగా మనమేమియు చేయలేము గనుక, ఆయనయే మన ప్రధాన లక్ష్యమైయుండవలెను. రాజైన దావీదు చేసిన సమస్త కార్యములలో, అతడు ఒకదానిని అత్యంత ప్రధానమైనదానిగా చూచెను :
యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను : యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.
కీర్తనలు 27:4
చక్రము అచ్చునుండి బలము పొందవలసినట్లే, మనము యేసుక్రీస్తునుండి మాత్రమే శక్తిని పొందగలము. క్రీస్తును మన జీవితములో మొదటి స్థానమున ఉంచినప్పుడే మనము ఆత్మసంబంధమైనదేదైన చేయగలము. కరుణాపీఠమువద్ద మనము దేవునితో సహవాసము చేయవలెను :
అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠముమీద నుండియు, శాసనములుగల మందసముమీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీతో మాటలాడుదును.
నిర్గమకాండము 25:22
క్రైస్తవ జీవితమును జీవించు శక్తిని పొందుటకు కృపాసింహాసనము నొద్దకు ధైర్యముగా చేరవలెను (హెబ్రీయులకు 4:16). మనము దేవునితో ప్రతిదినము సహవాసము చేయుచున్నామా?
  1. వాక్యము. దేవుని వాక్యమును మనము జీర్ణించుకొనుచున్నామా? ఈ ఆకు అయిదు వేరు వేరు విభాగములను కలిగియున్నది :

    1. వినుట. వాక్యమును మనము వినుచున్నామా?
    2. చదువుట. వాక్యమును మనము చదువుచున్నామా?
    3. అధ్యయనము. వాక్యమును మనము అధ్యయనము చేయుచున్నామా?
    4. ధ్యానించుట. వాక్యమునందు మనము ధ్యానించుచున్నామా?
    5. కంఠస్థము చేయుట. వాక్యమును మనము కంఠస్థము చేయుచున్నామా?

  2. ప్రార్థన. మనము ప్రార్థించవలసినట్లు ప్రార్థించుచున్నామా, దేవుని చిత్తమును తెలిసికొనుటకు వెదకుచున్నామా? బైబిలు కనీసము 3 ప్రార్థనా విధానములనుగూర్చియు, 4 వేరువేరు ప్రార్థనా రకములనుగూర్చియు తెలియజేయుచున్నది.

    ప్రార్థించు 3 విధానములు :

    • ఎడతెగక ప్రార్థించుట. ఎల్లప్పుడును తెలిసి ప్రభువుతో ప్రార్థించుచున్నానా?
      యెడతెగక ప్రార్థనచేయుడి.
      1 థెస్సలొనీకయులకు 5:17
    • ఇతరుల సన్నిధిని చేయు ప్రార్థనలు. ఉదాహరణకు, భోజనమునకు ముందు, ప్రయాణమునకు ముందు రక్షణ నిమిత్తము, మొదలగునవి.
      ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను.
      అపొస్తలుల కార్యములు 27:35
    • కనిపెట్టుకొనుట, లేక ప్రార్థనకు నిర్ణీతమైన సమయము.
      ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, పేతురుతో : ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా అనెను.
      మత్తయి 26:40
    నాలుగు వేరువేరు ప్రార్థనా రకములు :
    1. ఆరాధన (కీర్తనలు 146:1-2)
    2. పాపనిర్ణయము (1 యోహాను 1:9)
    3. కృతజ్ఞతాస్తుతులు (ఎఫెసీయులకు 5:20)
    4. విన్నపములు :
      • మధ్యవర్తిత్వము (1 తిమోతికి 2:1, ఎఫెసీయులకు 6:18)
      • అభ్యర్థనలు (1 సమూయేలు 1:27)
      • వ్యక్తిగతము (మత్తయి 7:7)

  3. సహవాసము. దేవునిగూర్చియు ఆయన వాక్యమునుగూర్చియు మనమే చూచినదానిని వినినదానిని ఒకరికొకరు తెలియజేయుటయే నిజమైన సహవాసమునకు ఆధారము. దేవుడు మనకు చూపిన ఆత్మసంబంధమైన సంగతులను సంఘములో ఒకే శరీరముగా ఇతర విశ్వాసులతో మనము పంచుకొనుచున్నామా?
    మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము, మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు; మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది.
    1 యోహాను 1:3
  4. సాక్ష్యము. మన రక్షకుని గూర్చి లోకమునకు మనము సాక్ష్యమిచ్చుచున్నామా, మనము స్వయముగా సువార్తకు లోబడుటకు సిద్ధముగా ఉన్నామా? (ఇంకను లోబడని ఒకనికి సాక్ష్యమిచ్చు ఆచరణాత్మక ఉదాహరణకు, మీరు విశ్వాసములో ఉన్నారేమో మిమ్మును మీరే శోధించుకొనుడి చూడుము.)
    అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు నాకు సాక్షులైయుందురు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను, భూదిగంతముల వరకును.
    అపొస్తలుల కార్యములు 1:8
  5. లోబడుట. రబ్బరు రహదారిని తాకు స్థలమిదియే. మన జీవనశైలి నిర్ణయములలోను, మన ఆర్థిక కార్యనిర్వహణలోను దేవుని వాక్యమునకు మనము లోబడుచున్నామా?
    మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.
    యోహాను 14:15
    ఇప్పుడే దేవుడు మనలను ఏమి చేయుమని అడుగుచున్నాడు?